గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు నిధులు త్వరగా విడుదల చేయాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇవ్వాల్సిన నిధులు వీలైనంత త్వరగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంకజ్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు తన విధుల నిర్వహణకు అవసరమయ్యే నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాలని పంకజ్ కుమార్ పేర్కొన్నారు. 2022-23 సంవత్సరానికి 10కోట్లతో గోదావరి బోర్డు బడ్జెట్ ఆమోదించారని… అందులో తెలంగాణ 5.27 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 3.84కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తమ చట్టబద్ధమైన బాధ్యతల మేరకు గోదావరి బోర్డుకు తక్షణమే నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కోరారు.