రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను తిరస్కరించడానికి గల కారణాలు చెప్పారు. ప్రభుత్వ వైద్య విద్య సంచాలకుడు, అదనపు వైద్య విద్య సంచాలకుడు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, మెడికల్ జనరల్ ఆసుపత్రుల సూపరింటెండెంట్ల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వంపై భారం పడే అవకాశాలున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వీరి పదవీ విరమణ వయసును పెంచుతూ 2022 సెప్టెంబరు 12న ప్రభుత్వం ఆమోదించిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీస్ (పదవీ విరమణ వయసు నియంత్రణ) సవరణ బిల్లు-2022ను తిరస్కరించడానికి కారణాలను ఆమె వెల్లడించారు.
ఈ బిల్లు వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని తమిళిసై పేర్కొన్నారు. 61 ఏళ్లకు పదవీవిరమణ పొందిన వారు తిరిగి ఇప్పుడు నియమితులైతే ఒక్క రోజు ఉద్యోగం చేయకున్నా వేతనం పొందేలా సవరణ ఉందన్నారు. ఇది తప్పుదారి పట్టించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు-2020 బిల్లునూ వెనక్కి పంపడం పైనా గవర్నర్ స్పందించారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఇస్తూ పోతే ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం లేదా..? అని అడుగుతూ వివరణ కోరారు.