డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రారంభోత్సవం రోజు నుంచే సెక్రటేరియట్లో కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దానికి తగిన చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతమున్న బీఆర్‌కే భవన్ నుంచి నూతన సచివాలయానికి దస్త్రాల తరలింపు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఏయే అంతస్తుల్లో ఏయే శాఖలు కొలువు దీరాలనే ఆదేశాలు వెలువడడంతో.. దస్త్రాలు, కంప్యూటర్ల తరలింపుపై సిబ్బంది దృష్టి పెట్టారు. నూతన సచివాలయంలో శాఖల వారీగా కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఉండడంతో.. బీఆర్‌కే భవన్ నుంచి ఎటువంటి ఫర్నిచర్‌ను తీసుకెళ్లవద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నెల 29 లోగా అన్ని శాఖల సామగ్రి తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.