హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో 16ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేసీఆర్ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. పోలీసులను ఈ ఘటన గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్… 48 గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ.. సహకారాలు అందించాలని తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.