గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హజరుకానున్నారు. బోర్డు నిర్వహణ వ్యయం, గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన సీడ్ మనీ, అదనపు పోస్టులు, ప్రత్యేక వసతి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు.. జీఆర్ఎంబీ సమావేశం ముందుకు రానున్నాయి. వాటిపై చర్చించి కేంద్ర జలసంఘానికి నివేదించాల్సి ఉంటుంది. నీటి ప్రవాహ లెక్కింపు కోసం గోదావరి బేసిన్లోనూ టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి బేసిన్లో ఉండే నీటి లభ్యతపై ఒక ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం చేయించే అంశంపైనా చర్చ జరగనుంది.