తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలు లేదన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడని.. తెలంగాణను దోచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాడని ఆరోపించారు. ప్రియాంక గాంధీ వచ్చినా పార్టీ నేతలను ఏకం చేయడానికి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తక్కెడలో కప్పలలాగా ఉందని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందారని అన్నారు. ఇక కర్ణాటక ఎన్నికలలో ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సభలో ప్రధాని మత నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో లౌకిక శక్తులు విజయం సాధించాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని అన్నారు.