రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అ’శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ గారు.. అంటూ సూచించారు. రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? అంటూ నిలదీశారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండని కోరారు.
మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు,
కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయిందని తెలిపారు. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.