తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..త్వరలోనే భారీ నోటిఫికేషన్

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పని తీరు, సాధించిన పురోగతిపై వెంగళ్ రావు నగర్ లోని IIHFW కార్యాలయంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు గారు సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.

ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి, అగ్రస్థానం చేరాలని కాంక్షించారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలి, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు.