రానున్న రెండు గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది. ఉదయం 11 గంటల వరకు భారీ వర్షం కురిసే వీలున్నందని వెల్లడించింది.
వాతావరణ కేంద్రం సూచనలతో అప్రమత్తమైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరదనీరు చేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశముందని చెప్పారు. కొంత సమయం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. వర్షం కురిసిన గంట తర్వాతే రోడ్లపైకి రావాలని సూచించారు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతల ద్రోణి కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షాలతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోతోంది. రోడ్లన్నీ చెరువులుగా మారి వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వానతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నగరంలో ఉదయం నుంచి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు, విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.
రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, శంషాబాద్, శాతంరాయి, శివరాంపల్లి, మణికొండ ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.