తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నగరానికి వరద ముంపు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలో ఇకపై సెల్లార్ నిర్మాణాలకు అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.పార్కింగ్ కోసం కొన్ని భవనాల్లో సెల్లార్‌ను రెండు నుంచి 5 అంతస్తుల వరకూ నిర్మిస్తుంటారు.హైదరాబాద్‌లోనూ అటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణాలు చాలానే ఉన్నాయి.అయితే, వరదలు వస్తే సెల్లార్లు మునిగిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఒకవేళ నగరంలో భూకంపం వస్తే సెల్లార్ నిర్మాణల వలన భవనాలు కూలిపోయే అవకాశం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా సెల్లార్లను పార్కింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.సెల్లార్లు లేకుంటే పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయంగా స్టిల్ట్ నిర్మాణాల (భూమి పై నుంచే పార్కింగ్ కోసం పలు అంతస్తులు వదిలి వేయడం)కు ఎన్ని అంతస్తులకైనా పర్మిషన్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.కాగా,ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల అనుమతించామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గరిష్ఠంగా 3 స్టిల్టుల వరకు అనుమతిస్తున్నామనిస్తుమన్నారు. ఇక నివాస సముదాయాల నిర్మాణంలోనూ ఈ విధానాన్ని బిల్డర్లు స్వాగతించినా.. కమర్షియల్ బిల్డింగ్‌ల నిర్మాణంలో పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. కమర్షియల్ బిల్డింగ్‌లలో గ్రౌండ్ ఫ్లోర్‌కు డిమాండ్ చాలా ఎక్కువ అని, అలాంటిది గ్రౌండ్ ఫ్లోర్‌ను పార్కింగ్‌కు వదిలివేస్తే నష్టపోవాల్సి వస్తుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా,దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.