భానుడి భగభగలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉన్నట్టుండి ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వెళ్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని ఎల్బీ నగర్, కొత్తాపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అంబర్‌పేట, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్ తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరం మొత్తం మేఘావృతమైంది. నగరంలో ఆదివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగాయి.
రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది.