హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా రాత్రంతా కురిసిన వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. అయితే సాయంత్రం పూట నెమ్మదిగా షురూ అయిన వాన రాత్రయ్యే సరికి బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో మంగళవారం రోజున పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావానికి పర్యాటకులు ప్రయాణిస్తున్న భాగమతి బోటు అదుపుతప్పి పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బోటులో 40 మందికి పైగా ఉన్నారు. సిబ్బంది అప్రమత్తమవ్వడంతో పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు.
మంగళవారం రాత్రి పర్యాటకులతో బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లిన బోటు.. ఈదురుగాలులతో అదుపు తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటక బోటులోని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 40 మంది పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు