ఏపీ సీఎం జగన్‌కు సంబంధించి జనసేన ఓ వీడియోను విడుదల చేసింది. ‘ప్రజా సమస్యలపై పవన్ స్పందిస్తే.. సీఎం జగన్ స్పందన ఇది. ఇలాంటి దిగజారుడు మనిషి, అసమర్థ సీఎం దేశంలో ఏ రాష్ట్రానికి ఉండరు. ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని పాలిస్తే, మీ భవిష్యత్తుకు భరోసా ఉంటుందా? ఆలోచించండి. వైసీపీ విముక్త ఏపీకి సిద్ధం కండి’ అని ట్వీట్ చేసింది. స్పందన, ప్రతిస్పందన అంటూ పవన్, జగన్ మాట్లాడిన వీడియోలను మిక్స్ చేసింది.
ఇదిలా ఉంటే.. వాలంటీర్ల విషయంలో పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం పరువునష్టం కేసు పెట్టాలనుకోవడం నీతిమాలిన చర్య అంటూ మండిపడ్డారు చంద్రబాబు. పరువు గురించి ఈ ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్ అని అన్నారాయన. నాలుగేళ్లు దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. “తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.” అంటూ పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేశారు చంద్రబాబు. పవన్ పై కేసు పెట్టడం, బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారాయన. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేస్తున్నారని, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణచివేస్తున్నారని.. ఇది రాక్షస ప్రభుత్వ విధానం అని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, అణచివేత ధోరణి మానుకోవాలని హితవు పలికారు.