రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వరంగల్ కి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తాం – రఘునందన్ రావు

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే మోడీ సహకారంతో వరంగల్ కు ఏర్ పోర్ట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని.. బిజెపితో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. దేశ సంపదను మోడీ గణనీయంగా పెంచారని అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత నాలుగు లక్షల కోట్ల పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలిగామని తెలిపారు.

33% యువతను కొత్తగా పార్లమెంటుకు పంపిన ఘనత మోడీదేనన్నారు. దేశ సంపదను ఎగ్గొట్టి విదేశాలలో తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరిని మోడీ దేశానికి రప్పిస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో ఏ దేశంలో లేని విధంగా 200 కోట్ల డోసులు ఉచితంగా అందించిన గొప్ప నేత మోడీ అని కొనియాడారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మోడీ ప్రదర్శించిన దౌత్య నీతి అసమాన్యమని, అమెరికా వంటి దేశాలు కూడా చేయని పనిని మోడీ చేసి చూపించారని అన్నారు.