నేడు సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ యువతలో మేధోసంపత్తిని బయటికి తీసుకువచ్చేందుకే ఈ క్విజ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
ఈ క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేసేరోజు ప్రియాంక గాంధీని ఆహ్వానించి రాహుల్ ను సన్మానిస్తామన్నారు. ఆస్కార్ పొందిన తెలంగాణ కళాకారునికి ఈ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తరపున రాహుల్ కు రూ.10లక్షలు నజరానా ప్రకటిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ కి రూ. కోటి రూపాయల బహుమతి అందిస్తామన్నారు. యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే ఈ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని తెలిపారు రేవంత్ రెడ్డి.