ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భోగస్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో రుణమాఫీ చెక్కులు విడుదల చేస్తే.. ఇంత వరకు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ రైతులకు చేరలేదు అన్నారు. ఆ చెక్కులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఉపాధి హామీ కూలీలకు దగా చేస్తున్నారు. అడుగడుగునా దగా చేస్తున్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పకనే చెప్పుతున్నారు. ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి.. ఎన్నికల తరువాత నరకం చూపిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలా ఉంది.. రేవంత్ పాలనలో రైతులకు ఎలా ఉంది..? అని ప్రశ్నించారు. రైతులు ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. వ్యవసాయ కూలీలందరికీ రూ.12వేలు ఇస్తానన్నారు. ప్రతీ పథకంలో ఎగవేతలు, కోతలు.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.