సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎలాగూ ఉండరని, ప్రజా సమస్యలను పట్టించుకోరన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఎన్నికలప్పుడు లేదా మరి ఏదైనా ప్రయోజనం కోసమో అయితేనే తప్ప ఫామ్ హౌస్, ప్రగతి భవన్ దాటి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
కనీసం ప్రజా సమస్యలపై అవగాహన కల్పించే అవకాశం ఇస్తున్న బడ్జెట్ సమావేశాలకు సైతం బిఆర్ఎస్ సభ్యులు సక్రమంగా హాజరు కాకపోవడం బాధ కలిగిస్తుంది అన్నారు విజయశాంతి. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో టిఆర్ఎస్ సభ్యుల హాజరు పల్చగా ఉండటం చూస్తే వారిని ఎన్నుకున్న ప్రజలకు వీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అనిపిస్తుంది అన్నారు.
కనీసం వారి సెగ్మెంట్ కి సంబంధించిన సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉన్న ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా వీరు ఉపయోగించుకోవడంలేదని మండిపడ్డారు. సభకు వచ్చిన ఆ కొద్ది మంది లాబీలలోనే మంత్రుల ఛాంబర్ లో తిరుగుతున్నారని అక్కడున్న మీడియా ప్రతినిధులే చెబుతున్నారని అన్నారు. కెసిఆర్, కేటీఆర్ సభకు వచ్చినప్పుడు మాత్రమే అధికారపక్ష సభ్యులు కాస్త అలర్ట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఈ తీరును ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గర పడుతున్నాయన్న సంగతి మర్చిపోవద్దు అని హెచ్చరించారు విజయశాంతి.