రాష్ట్ర ప్రజల జీవితాలతో సీఎం కేసీఆర్ చలగాటమాడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైబర్ నేరగాల్లుగా మారారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు కట్టిన డబ్బులు ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం లేదన్నారు. ధరణి ద్వారా దేశం సరిహద్దులు దాటి మన సమాచారం బయటకు వెళుతుందన్నారు.
తెలంగాణకు చెందిన 70 లక్షల భూ యాజమానుల వివరాలు ధరణి పోర్టల్ కారణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి వెళ్లిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ధరణి నిర్వహణను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఫైనాన్స్ సంస్థకు అప్పగించారని తెలిపారు. 90 వేల కోట్లకు దివాలా తీసిన ఐఎల్ఎఫ్ఎన్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. ధరణిలో జరిగిన లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని డిమాండ్ చేశారు.