తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి సీఎం హోదాలు రెండు ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఆ తరువాత సచివాలయంలో క్యాబినెట్ భేటీ అయ్యారు. 6 గ్యారెంటీ పథకాలపై చర్చలు జరిపారు.
ఇవాళ సాయంత్రం సచివాలయంలో ఉద్యోగులను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టామని.. మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తమ ప్రభుత్వ నిర్ణయాలతో కేసీఆర్ కి దిమ్మ తిరుగుతుందని.. ఆయన అహంకారాన్ని దించేస్తామని స్పష్టం చేశారు. చేసిన పొరపాట్లకు బీఆర్ఎస్ అధినేత పశ్చాత్తాపం చెందాలన్నారు. మొన్నటివరకు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలకు అవకాశం లేదని.. ఇకపై ఎవ్వరు అయినా ప్రగతి భవన్ కి రావచ్చని తెలిపారు మంత్రి జూపల్లి.