నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త..

-

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించే ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు.

పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మిడియేట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలను ఇంటర్మిడియేట్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి బడుగు బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news