కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ కి నిధులు ఇస్తుంది కేసీఆరే – బండి సంజయ్

-

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చుతున్నది సీఎం కేసీఆరే అని ఆరోపించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం పంపిస్తున్నాడని విమర్శించారు.

గతంలో జెడిఎస్ కి మద్దతు ఇస్తామని చెప్పి వాళ్లకు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడని అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఉంటే మహారాష్ట్రలో తిరిగిన కేసీఆర్.. అక్కడ జరిగిన ఎన్నికలలో ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలతో నష్టపోయి ఏడుస్తుంటే.. రాజకీయాల కోసం కేసీఆర్ ఢిల్లీ పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు.

బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏమిటన్న భయంతోనే అక్కడి హిందువులంతా ఒక్కటయ్యారని చెప్పారు బండి సంజయ్. మిడ్ మానేరు నిర్వాసితులలో కేసీఆర్ అత్తగారి ఊరు కూడా ఉందని.. వాళ్లంతా పిల్లనిచ్చిన పాపానికి మోసం చేశాడని బాధపడుతున్నారని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news