తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మార్పు విషయంపై స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఇప్పట్లో మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని.. దాన్ని భూతద్దంలో చూడడం అనవసరమని అన్నారు. తామంతా ఒకే కుటుంబం అని వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.
కల్వకుంట్ల కవిత అరెస్టు మా చేతుల్లో లేదని.. ఇది సిబిఐ పరిధిలోని అంశమని అన్నారు. అవినీతికి పాల్పడిన కర్ణాటక బిజెపి ఎమ్మెల్యేలు జైలుకు పంపించామని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇక 2000 నోటు ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని.. నోట్ల రద్దు లో మా ప్లాన్ మాకు ఉందని అన్నారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ ను ఎంఐఎం పార్టీ నడిపిస్తుందని.. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు.