నెక్లెస్‌రోడ్డులో బీజేపీ నేత‌ల సంద‌డి

– పతంగులు ఎగరేసిన క‌మ‌ళం నేత‌లు
– త్వ‌ర‌లోనే అంద‌రికీ మంచి రోజులు రావాలి : కేంద్ర‌ మంత్రి కిష‌న్ రెడ్డి

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో బీజేపీ నేత‌లు తెగ సంద‌డి చేశారు. రాజ‌ధానిలోని నెక్ల‌స్ రోడ్డులో సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్వర్యంలో ప‌తంగుల ఉత్స‌వాన్ని  (కైట్ ఫెస్టివల్) నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమాన్ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నేత‌ల‌తో పాటు క‌మ‌ళం కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పాల్గొని.. ప‌తంగుల‌ను ఎగుర‌వేశారు.

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ , మాజీ ఎంపీ వివేక్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు యావ‌త్ ప్ర‌జానికానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ, కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ‌త కొన్ని నెల‌లుగా దేశంలో క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయ‌న్నారు. అయితే, నేటి సంక్రాంతి నుంచి ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో మార్పు మొద‌లై.. మంచి జ‌ర‌గాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు.

అలాగే, ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ సాగు చ‌ట్టాల గురించి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ద్వారా రైతులకు మేలు జ‌రుగుతుంద‌న్నారు. కానీ ప్ర‌తిప‌క్షాలు త‌ప్ప‌డు ఆరోప‌ణ‌ల‌తో అన్న‌దాత‌ల‌ను త‌ప్పుదొవ ప‌ట్టిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర పాల‌న‌పై స్పందిస్తూ.. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాల‌ర్పించిన అమ‌ర‌వీరులు కోరుకున్న విధంగా పాలించే రోజులు రాష్ట్రంలో రావాల‌ని అన్నారు. దేశంలో త్వ‌ర‌లోనే క‌రోనా క‌ట్ట‌డి అవుతుంద‌నీ, ప్ర‌జ‌లంద‌రికీ టీకా అందించ‌డానికి కేంద్రం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపారు. ప్ర‌పంచానికి క‌రోనా టీకాలు అందిస్తూ.. భార‌త్ ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ద‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.