తెలంగాణ ఉద్య‌మ నేతలతో మరో ఉద్యమం

-

తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారంద‌రితో క‌లిసి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో ఉద్య‌మాన్ని ప్రారంభించాల్సి ఉంద‌ని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలపై కోదండరామ్‌ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈటలపై కుట్ర చేశారన్నారు. పనిచేసే వాళ్లను కేసీఆర్ పక్కన పెడుతున్నారన్నారని అన్నారు. హ‌ఫీజ్‌పేట్, మియాపూర్ భూముల‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

మంత్రి ఈటలతో పాటు కేటీఆర్‌, మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్‌రెడ్డిపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకోవ‌డానికే తెలంగాణ‌లో భూవివాదాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నార‌ని అన్నారు. టీఆర్ఎస్‌పై గట్టిగా మాట్లాడినందుకే ఈటలపై విచారణ జరుగుతోందన్నారు. తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ విషయం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించడానికే ఈట‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని కోదండరామ్‌ ఆరోపించారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి శనివారం ఉదయం విచారణ ప్రారంభమైంది. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌‌, రెవెన్యూ అధికారులు విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణను పరిశీలించిన మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మంత్రి ఈటల అసైన్డ్‌ భూమిని ఆక్రమించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news