సిరిసిల్లలోని బివై నగర్ కు చెందిన చిటికెన నవీన్ అనే నిరుద్యోగి ఆత్మహత్య సంచలనంగా మారింది. అది కూడా గ్రూప్-1 పరీక్ష రద్దు చేసిన మరుసటిరోజే నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సంఘటన కూడా వివాదాస్పదంగా మారింది. గ్రూప్-1 రద్దు కారణంగానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే ప్రచారం సాగింది. కానీ అది వాస్తవం కాదు. ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనతో ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక నవీన్ ఆత్మహత్యపై తెలంగాణలో పెద్ద దుమారమే చెలరేగింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన నవీన్ పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీనికి ప్రభుత్వమే కారణమని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇది వాస్తవం కాకపోయినా సరే నవీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. అతని కుటుంబంలో ఒకరికి పొరుగు సేవల విధానంలో ఉద్యోగం కల్పించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నవీన్ రెండో సోదరుడికి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బసవరాజుసారయ్య బాధిత కుటుంబానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందజేశారు. నవీన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకే నవీన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించారు.