రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్ సింగ్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కోరారు. రెండో దశ కింద నిర్మించబోయే బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్-2 విస్తరణ పనులకు రూ.8453కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. దీనికోసం 2023-24 బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు.
మొదటి దశ కింద 69కి.మీ మేర నిర్మించిన మెట్రో విజయవంతంగా నడుస్తున్నట్లు కేంద్ర మంత్రికి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశలో మొత్తం 31కి.మీ పొడవును రెండు భాగాల్లో రూపొందించారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26కి.మీ.పొడవుతో మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఇందులో 23 స్టేషన్లు నిర్మిస్తారు. మరోవైపు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5కి.మీ మేర 4 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.