ఈనెల 8న రామగుండం రానున్నారు ఐటి మినిస్టర్ కేటీఆర్. రామగుండంలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈనెల 8న కేటీఆర్, హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ తో పాటు పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు.
28 ఎకరాల స్థలంలో 38 కోట్ల 50 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మించామని అన్నారు. కమిషనరేట్ బిల్డింగ్ లో ఉన్న అన్ని విభాగాలను అణువణువు పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ బిల్డింగులు సిద్ధమయ్యయని అన్నారు. ఇదే క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.