హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

-

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సదానంద గౌడకు మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందని, ఇప్పటికైన ఈ దిశగా కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రానున్న ఆరు నెలల్లో సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ నగరం నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్న కేటీఆర్…ఇంతటి ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరంలో వ్యాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ఏకైక వ్యాక్సిన్ టెస్టింగ్ కసౌలిలో ఉందని.. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ కి ఇక్కడి సంస్థలు తయారుచేసే ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందని, దీని వల్ల ఈ టెస్టింగ్ ప్రక్రియకి 30 నుంచి 45 రోజుల సమయం వృథా అవుతుందని వివరించారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమైన విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.

హైదరాబాద్‌లో టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని కేటీఆర్ తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఈ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ఉపయోగపడుతుందని అన్నారు.ఈ వ్యాక్సిన్ టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news