తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు హత్య కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మడకం తుల, మిడియం నంగాలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ క్రమంలోనే దోషులకు జీవిత ఖైదుతో పాటు వేయి రూపాయలు జరిమానా విధించింది.
గతేడాది చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు భూముల్లో చెట్లు నరుకుతుండగా ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక్కటైన గుత్తికోయలు శ్రీనివాస రావుపై దాడికి తెగబడ్డారు. ముఖ్యంగా శ్రీనివాస రావును.. అదే గ్రామానికి చెందిన తుల, నంగాలు వేట కొడవళ్లతో దాడి చేర్చి హత మార్చారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గుత్తికోయలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే అటవీ అధికారులపై ఎవరైనా దాడులకు తెగబడితే కఠిన చర్యలుంటాయని తీవ్రంగా హెచ్చరించారు.