టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ హైదరాబాదులో హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ బిజెపి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది బిజెపి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలంగాణలో బిజెపికి స్థానం లేకుండా చేయాలన్నారు. హిందుత్వం పేరుతో హిందూ మత గౌరవాలను, విశ్వశాలను బిజెపి మంటగలిపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రాలు చేసినా సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ సమాజం వాటిని తిప్పి కొడుతుందనిందని అన్నారు. మిగతా రాష్ట్రాలలో మాదిరిగా ఇక్కడ బిజెపి ఆకర్ష్ పని చేయదని.. రానున్న రోజుల్లో కమలం పువ్వు వాడిపోవడం ఖాయమన్నారు.