పేదలు వర్సెస్ పెత్తందార్లు…ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది. ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్, వైసీపీ నేతలు ఈ మాటని లైన్ లోకి తీసుకొచ్చారో..లేక టిడిపిని దెబ్బతీయడానికి వ్యూహం వేశారో తెలియదు గాని..ఏపీలో క్లాస్ వార్ జరుగుతుందని, ఓ వైపు పేదలు, మరోవైపు పెత్తందార్లు ఉన్నారని, పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ ప్రతి సభలోనూ చెబుతూ వస్తున్నారు.
అంటే పేదలకు మేలు చేసే జగన్ ఓ వైపు..పెత్తందార్లకు మేలు చేసే చంద్రబాబు ఓ వైపు అని అంటున్నారు. పేదల పక్షాన నిలబడుతున్న తనకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని జగన్ అంటున్నారు. అయితే జగన్ మతలతోనే ఈ అంశం ఆగిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలు వేస్తుంది. అందులో పేదలని కాపాడుతున్నట్లు జగన్ ఫోటో పెట్టి..ఇక వారిపై రాళ్ళు విసురుతున్నట్లు చంద్రబాబు, లోకేష్ ఓ పల్లకిపై ఉంటే దాన్ని మోసే వారిలో పవన్ ఫోటో పెట్టి.. వారంతా కలిసి జగన్ పై రాళ్ళు విసురుతున్నట్లు ఫ్లెక్సీలు కడుతున్నారు.
ఈ ఫ్లెక్సీలపై టీడీపీ, జనసేన పార్టీల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. తమ నాయకులని కించపర్చేలా ఫోటోలు పెడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి పోటీగా టిడిపి, జనసేన నేతలు సైతం ఫ్లెక్సీలు కడుతున్నారు. జగనాసుర రక్తచరిత్ర అంటూ పది తలలతో ఉన్న జగన్ ఫోటో పెడుతున్నారు. అయితే టిడిపి, జనసేనలు కట్టే ఫ్లెక్సీలని పోలీసులు తొలగిస్తున్నారు. తమ ఫ్లెక్సీలని తొలగిస్తే..వైసీపీ ఫ్లెక్సీలని కూడా తొలగించాలని, వాటిని ఎందుకు వదిలేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీ చెప్పినట్లే చేస్తున్నారని మండిపడుతున్నారు.
అయితే ఇలా వైసీపీ వర్సెస్ టిడిపి-జనసేన అన్నట్లు పోరు జరుగుతుంది. పేదలు, పెత్తందార్లు అంటూ యుద్ధం నడుస్తుంది. కాకపోతే ఇందులో ఎవరి పేదల పక్షాన ఉన్నారు..ఎవరు పెత్తందార్లు పక్షాన ఉన్నారు అనేది ప్రజలే తేల్చాలి. ఎన్నికల సమయంలో వారు ఇచ్చే తీర్పే దీనికి పరిష్కారం అని చెప్పవచ్చు.