మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మరో 24 గంటల్లో నియోజకవర్గ ప్రజలు తమ ఆయుధాన్ని ఉపయోగించుకోనున్నారు. మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే గడియ సమీపిస్తోంది. ఈ తరుణంలో కొన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా జరగకుండా ఓటర్లు ప్రలోభాలకు గురి కావొద్దని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
చండూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించిన ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
మరోవైపు ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సర్వం సిద్ధం చేయగా చండూరులోని డాన్ బోస్కో కళాశాలలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు.