తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా లబ్దిదారులకు పథకాలను అందించేందుకు కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలన్నది రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుందని, ఇందుకు సంబంధించి అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల స్వీకరించిన ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. రేషన్ కార్డులు, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ముఖ్యంగా ఐదు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విశేషం.