టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసు రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఇప్పటికే 74 కి చేరింది. నిందితుడు పోల రమేష్.. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా గుర్తించారు. పోల రమేష్ ఇచ్చిన సమాచారంతో మరో పది మందిని అరెస్ట్ చేశారు. ఇక మిగతా వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది.
ఒక్కో నిందితుడిని విచారిస్తే మరిన్ని కొత్త పేర్లు బయట పడుతున్నాయి. చైన్ సిస్టం మాదిరి ప్రశ్నాపత్రాలు అమ్మినట్టు గుర్తించారు సిట్ అధికారులు. తాజాగా అరెస్ట్ అయిన 10 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది సిట్ బృందం. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే వున్నట్టు గుర్తించింది సిట్. ఇక ఈ కేసులో అరెస్ట్ ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.