అలా చేస్తేనే భవిష్యత్తులో టిఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం – కూనంనేని

బిజెపి పై టిఆర్ఎస్ పోరాటం ఇలాగే కొనసాగితే తమ మద్దతు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో చంద్రుగొండ అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యను ఖండిస్తున్నామని చెప్పారు.

ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందికి విధి నిర్వహణలో ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశంలో అరాచక పాలన కొనసాగుతుందని కూనంనేని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈడి, ఐటి ఎలక్షన్ కమిషన్, జ్యుడీషియరీ ఉపయోగించి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్లలో మూడు వేలకు పైగా ఈడీ దాడులు చేశారని, విపక్ష నేతలను లొంగదీసుకునేందుకే ఈ దాడులు అని ఆక్షేపించారు. రాబోయే ఎన్నికలలో సిపిఐ వర్సెస్ బిజెపిగా పోటీ చేద్దామని బండి సంజయ్ కి సవాల్ విసిరారు.