మెహబూబ్ నగర్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకి మరోసారి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. మహబూబ్నగర్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీంతో రెండోసారి షర్మిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గతంలో ఆందోల్ ఎమ్మెల్యే పై చేసిన కామెంట్స్ తో అట్రాసిటీ నమోదు కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో మరోసారి కేసు నమోదు అయింది. అయితే నేడు వైయస్ షర్మిల మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదని అన్నారు.
పాదయాత్రకు అనుమతి కోసం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయడం తప్పా? అని ప్రశ్నించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ నాయకులలో భయం పట్టుకుందన్నారు షర్మిల. అధికార దాహంతో బిఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.