కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. నేడు మహబూబాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించే ఉచితలకు ప్రజలు మోసపోవద్దని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బిజెపి అన్ని ఫ్రీగా ఇస్తామని మాయ మాటలు చెబుతున్నాయని విమర్శించారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ గుడ్డి గుర్రాల పళ్ళు తోమిందా..? అని ప్రశ్నించారు.
ములుగు గిరిజన వర్సిటీ ఏమైందని ప్రధాని మోదీని అడుగుతున్నానని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. వరంగల్ పర్యటనకు రానున్న మోడీ వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత ప్రజలకు సుపరిపాలన అందుబాటులోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు.. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.