హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో.. పీఈటీ పోస్టులను పెంచాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ.. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకుని.. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించారు. కానీ విద్యార్థులు ససేమిరా అనడంతో ఓయూ పీఎస్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ ఉద్యోగాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం.. ప్రజాపాలన కాదు దగా పాలన అని విద్యార్థి నాయకులు మండిపడ్డారు.