రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరిన జనగామ జిల్లాకు చెందిన కీలక నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిపై పొన్నాల తీవ్రంగా స్పందించారు. తనకు ఎవరూ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. తనకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారని జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు. తాను 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవ చేసిన పార్టీలో ఇటీవలి కాలంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా తాను చివరకు ఓ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇలాంటి చిల్లర ప్రచారాలకు తాను ప్రభావితం కానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలను చీడ పురుగుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్ వచ్చిందని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరినట్లుగా ప్రచారం సాగింది. అంతేకాదు, ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలవాలని రాహుల్ టీమ్ కోరిందని వార్తలు వచ్చాయి.