దసరా రోజు నుంచి తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరిపైరు కోతకొచ్చిన సమయంలో అకాలంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలవుతుందేమోనని భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
వర్షాల ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.