తెలంగాణలో నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం

-

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంపై ఉందని వాతావరణశాఖ ఆదివారం తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. మరోవైపు రుతుపవనాల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి అల్పపీడనం ప్రాంతం వరకూ వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

కొద్దిగంటల్లోనే కుంభవృష్టి మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలోని 484 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములకచర్ల(నల్గొండ జిల్లా)లో 10.6, పిప్పల్‌ధరి(ఆదిలాబాద్‌)లో 5.9, కన్నాయిగూడెం(ములుగు)లో 5.1, బెజ్జూరు(కుమురం భీం)లో 4.9. పెద్దంపేట(జయశంకర్‌)లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇప్పటికే హైదరాబాద్​లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్​బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news