RAIN ALERT : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

-

తెలంగాణలో ఇవాళ, రేపు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని తెలిపింది. మరోవైపు ఏపీ తీరంలో బంగాళాఖాతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది.


రాజధాని నగరంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామునే దంచికొట్టిన వాన మధ్యాహ్నానికి తగ్గిపోయింది. మళ్లీ సాయంత్రం కుండపోతగా కురిసింది. సాయంత్రం పూట ఏకధాటిగా గంటసేపు వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాన పడటం వల్ల పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నగరంలో అర్ధరాత్రి పూట.. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో వాన పడింది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. నిన్న మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version