నిన్నటి వేళ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. వాటిలో ఈనాడు సీనియర్ స్టాఫర్ వేణుగోపాల్ నాయుడు గెలిచారు.ఇతర కార్యవర్గ ఎన్నిక కూడా సజావుగానే ముగిసింది.అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కొందరు జర్నలిస్టులు తమకు ఓటు హక్కు లేకుండా చేశారన్న వాదన కూడా వినిపించారు.ప్రెస్ క్లబ్ సభ్యత్వ రుసుము తాము గతంలో చెల్లించినప్పటికీ తమను పట్టించుకోలేదని, అంతర్గత రాజకీయాల్లో భాగంగా తమను దూరంపెట్టారని కొన్ని ప్రముఖ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సోషల్ మీడియాలో తమ గోడు చెప్పుకున్నారు.
మరోవైపు ఈనాడుదే గెలుపు.. అన్న ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈనాడు గెలిచినా లేదా సాక్షి గెలిచినా ఇంకా చెప్పాలంటే మరో మీడియా ప్రతినిధో గెలిచినా అక్కడ వచ్చే మార్పు ఏమిటన్నది ఓ ప్రామాణికం కావాలి. సంబంధిత ఆలోచనే ఓ ప్రామాణికం కావాలి. ఎన్నాళ్ల నుంచో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ను పేకాట క్లబ్ గా మార్చేశారని, అదేవిధంగా అక్కడ తాగుబోతుల రాజ్యం నడుస్తోందని,ఏ చిన్న మీటింగ్ నిర్వహించుకోవాలన్నా ప్రజా సంఘాలను సైతం అక్కడి జర్నలిస్టు జలగలు వదిలి పెట్టడం లేదని ఈవిధంగా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.
వీటిని వేణు గోపాల్ నాయుడు పరిష్కరించగలరా అన్నదే ఓ పెద్ద సంశయం.ఇదే కాదు అక్కడ ఎప్పటి నుంచో ఆడవాళ్లకు రక్షణ లేదని,ముఖ్యంగా మీడియాలో లైంగిక వేధింపులు ఉన్నాయని ప్రెస్ క్లబ్ కో లేదా ఇతర జర్నలిస్టు సంఘాలకో చెప్పినా తమకు న్యాయం దక్కడం లేదని ఎన్నో సార్లు వాపోయారు సంబంధిత బాధితులు. వీటిని వేణు గోపాల్ నాయుడు పరిష్కరించగలరా? ఆ విధంగా ఆయన పరిష్కరించగలిగితే బాధిత స్వరం విని మానవతను చాటుకుంటే అప్పుడు ఈనాడు గెలిచిందని రాయాలి. అప్పుడు వేణు గోపాల్ నాయుడు గెలుపునకు సార్థకత దక్కిందని చెప్పాలి. సాధ్యమా?