ఈ నెల 10న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నామినేషన్

నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలకి ఈనెల 10 న నామినేషన్ దాఖలు చేయనున్నారు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల తీర్పుతో కెసిఆర్ పతనం మొదలవుతుందని అన్నారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోనని తెలిపారు.

కెసిఆర్ కుటుంబం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైందని అన్నారు. ఇక శుక్రవారం ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాగా.. శుక్రవారం నుంచి ఈనెల 14 దాకా నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈనెల 10 నామినేషన్ దాఖలు చేయనున్నారు. 11న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, 12న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.