ఇంటర్ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2019 సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణమని…. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు – తదుపరి పరిణామాలు చూస్తుంటే మీలో ఆ విజ్ఞత లోపించిందని అర్థమవుతోందని పేర్కొన్నారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు పోవడానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం కారణమైందరి,,. ఆ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని, ఇంటర్మీడియట్ బోర్డును సంస్కరిస్తారని ఆశించామన్నారు.
ఫలితం శూన్యం అని నేటి పరిణామాలు చూస్తే అర్థమవుతోందని… మీ వ్యవహార శైలి చూస్తుంటే తెలంగాణలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేయాలన్న దురుద్దేశం ఉందేమో అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని.. విద్యకు దూరం చేసి అంధకారంలో ఉంచితే ప్రశ్నించే తత్వం నశిస్తుందని తెలిపారు. అందుకే చాపకింద నీరులా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందేమోననిపిస్తోందని వెల్లడించారు.