పాలకులు మారినా ప్రజల బ్రతుకులు మారలేదు – సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా ఖంధార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందుకోసం బైల్ బజార్ లో ఏకంగా 15 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడంమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ సభకి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇక సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిన ప్రజల బతుకులు మాత్రం మారలేదన్నారు. ఈ దేశాన్ని అత్యధిక ఏళ్ళు పాలించిన కాంగ్రెస్, బిజెపి రైతులకు ఏం చేశాయని ప్రశ్నించారు.

ఈ రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదని నిలదీశారు సీఎం కేసీఆర్. తాను చెప్పేది నిజమో, అబద్ధము మీరే ఆలోచించాలని అన్నారు. దేశంలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని.. కానీ కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామన్నారు. మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలా చోట్ల అందుబాటులో లేదన్నారు.