సికింద్రాబాద్ రైల్ నిలయంలో కరోనా కలకలం.. ఒకేసారి ఏకంగా..!

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు.. అందరూ దీని బారిన పడుతున్నారు. పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడాలిపోతున్నారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొన్ని కార్యాలయాలు తెరుచుకోబడ్డాయి. అలాగే కొంతమేరకు రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా.. సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపింది.

రైల్‌ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి ఉన్నతాధికారులు కోవిడ్‌ టెస్ట్‌ లు చేయించారు. వారిలో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్‌ నిలయం కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం రైల్ నిలయంలో కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.