TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు టెక్నాలజీని ఉపయోగించుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితులెవరూ నోరు విప్పకపోవడంతో సిట్ అధికారులు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. నిందితులకు చెందిన బ్యాంకుఖాతాలు, సెల్‌ఫోన్లు పూర్తిగా విశ్లేషించిన పోలీసులు.. వారి కుటుంబసభ్యులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. కాల్ డేటా అధారంగా నిందితులు ఎవరెవరితో మాట్లాడారు? ఎక్కడెక్కడ కలిశారు? అనే వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు
బ్యాంకు లావాదేవీల ఆధారంగా సిట్ అధికారులు నలుగురు నిందితులను ఇటీవల గుర్తించారు. ప్రవీణ్ బ్యాంకుఖాతాలో నగదు జమ చేసిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, ఆయన భార్య సుష్మితలను అరెస్ట్ చేశారు. DAO ప్రశ్నపత్రం కోసం ప్రవీణ్ ఖాతాలో.. తన భార్య సుష్మిత సాయంతో సాయి లౌకిక్ నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌కి చెందిన తండ్రి కుమారులు మైబయ్య, జనార్దన్‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డాక్యా, మైబయ్య మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్ లో కలిసినట్లు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అధికారులు గుర్తించారు. పక్కా ఆధారాలు ముందుంచడంతో నిందితులు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.