భారీ భద్రత నడుమ రేపటి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణంలో, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాల పనిదినాలు, ఎజెండా రేపు ఖరారు కానుంది. శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్‌కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది.
రెండు సభల సభావ్యవహారాల సలహాసంఘం కమిటీలు రేపు సమావేశమై పనిదినాలతో పాటు చర్చించే అంశాలను ఖరారు చేస్తాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూముల అంశం, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.