మునుగోడు సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు : సీఈవో వికాస్‌రాజ్‌

-

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రేపటితో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో 2.41లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికకు 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

కొత్తగా ఓటు హక్కు సంపాదించుకున్న వారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశామని సీఈవో తెలిపారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీవిజల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news